cab driver letter: 'మనం మారాలి బ్రదర్' అంటున్న క్యాబ్ డ్రైవర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్


ఓ క్యాబ్ డ్రైవర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ కు చెందిన సాహిల్ తోమర్ పెద్దగా చదువుకోలేదు. పదో తరగతి అతి కష్టం మీద పూర్తిచేసి, డ్రైవింగ్ నేర్చుకుని, తండ్రి సలహా మేరకు ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ గా చేరాడు. నగర జీవనాన్ని అర్థం చేసుకుని అలవాటు చేసుకునేందుకు పెద్ద యుద్ధమే చేశానని అన్నాడు. 'మొదట్లో అర్ధరాత్రుళ్లు అమ్మాయిలు క్యాబ్ ఎక్కడం ఆశ్చర్యాన్నిస్తే, పొట్టి దుస్తులు ధరించి మరికొందరు క్యాబ్ ఎక్కడం మరింత ఆశ్చర్యాన్నిచ్చేదని, దీంతో ఈ విధానానికి అలవాటుపడడానికి చాలాఇబ్బంది పడ్డానని తెలిపాడు.

 నిర్భయ ఘటన అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గుర్తుచేశాడు. 'క్యాబ్ డ్రైవర్ అంటేనే అనుమానించాల్సిన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో క్యాబ్ ఎక్కేముందు దానిని ఫోటోతీసి తల్లిదండ్రులకు పంపుతున్నారు. దీనిపై క్యాబ్ డ్రైవర్లంతా ఆలోచించాలి. ఏ రంగంలో అయినా నమ్మకం ముఖ్యం. మన కష్టమర్లు మనల్ని నమ్మడం లేదంటే ఆ వ్యాపారం ఫెయిల్ అయినట్టే లెక్క. క్యాబ్ డ్రైవర్ అంటే కష్టమర్లను ఒక చోటనుంచి మరోచోటుకి చేర్చేవారు మాత్రమేకాదు అనే నమ్మకాన్ని కల్పించాలి.

 ఒక వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకున్నాడంటే అతనిని ఎక్కించుకున్నప్పటి నుంచి అతను గమ్యస్థానం చేరే వరకు మనం పూర్తి బాధ్యత తీసుకోవాలి. వారిని సురక్షితంగా గమ్యం చేర్చాలి. ప్రయాణికుల నమ్మకాన్ని చూరగొనాలి. క్యాబ్ డ్రైవర్ అంటే మహిళలు గౌరవించే పరిస్థితి తీసుకురావాలి. మనపై నమ్మకముంచి క్యాబ్ ఎక్కిన ప్రయాణికుడి కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం చూడాలి. ఇలా జరగాలంటే మనం మారాలి. అలా మారితే పనితో పాటు ఆనందం కూడా మన సొంతమవుతుంది' అని సాహిల్ తోమర్ సహ క్యాబ్ డ్రైవర్లకు తెలిపాడు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

  • Loading...

More Telugu News