fake gang rape: పరీక్షకు ఎందుకు అటెండ్ కాలేదంటే....గ్యాంగ్ రేప్ చేశారని చెప్పింది!
ఢిల్లీలోని నోయిడాలో కలలో కూడా ఊహించని ఘటన చోటుచేసుకుంది. నోయిడా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న యువతి పరీక్షకు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆమెను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో తల్లిదండ్రులకు ఎలా సమాధానం చెప్పాలో తెలియని యువతి, తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని, అందుకే తాను పరీక్షా సమయానికి వెళ్లలేకపోయానని తెలిపింది. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు సఫ్దర్ జంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఆమెను వివరాలు అడగగా, నలుగురు గుర్తుతెలియని ఆగంతుకులు కారులో వచ్చి తనను అడ్డుకుని గన్ పాయింట్ వద్దనున్న మహామాయ ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని తెలిపింది. దీంతో ఆ పరిసరాల్లో సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులకు అలాంటి ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఫ్లైఓవర్ పరిసరాల్లో సీసీటీవీల్లో కూడా ఎలాంటి పుటేజ్ లభ్యం కాలేదు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఆమెపై గ్యాంగ్ రేప్ జరగలేదని, పరీక్ష రాయలేదంటే తల్లిదండ్రులేమంటారోనన్న భయంతోనే అలా చెప్పిందని గుర్తించారు. దీంతో ఆమెను మందలించి వదిలేశారు.