50kgs gold accused: 50 కిలోల బంగారంతో విదేశాలకు పారిపోయి మళ్లీ హైదరాబాద్ కు వచ్చాడు.. అరెస్టయ్యాడు!
ఎక్కువ లాభాలు ఇస్తానని మాయమాటలు చెప్పి పలువురి వద్ద నుంచి 50 కిలోల బంగారం తీసుకొని పరారయిన వ్యాపారి బిపిన్‌జైన్‌ను చార్మినార్ పోలీసులు ఎట్టకేలకు ఈ రోజు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ వ్యాపారి మొత్తం 11 మంది నుంచి ఈ బంగారాన్ని తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీసులు నిందితుడి నుంచి నాలుగు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
అతడిపై హైదరాబాద్‌లోని నారాయణగూడ, అబిడ్స్, పంజాగుట్ట, చార్మినార్ తో పాటు మరో ఐదు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు పెట్టారు. బిపిన్‌జైన్‌ను తాము పది రోజుల కస్టడీకి తీసుకొని విచారించనున్నానని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితుడు కొందరు వ్యాపారుల నుంచి సేకరించిన బంగారాన్నంతా తీసుకొని తన కుటుంబ సభ్యులతో సహా పారిపోయి జకర్తా, నేపాల్ దేశాల్లో కొంతకాలం గడిపాడు. అనంతరం మహరాష్ట్రకు వచ్చాడు.
తాజాగా సోమాజిగూడలో ఉండే తన నివాసానికి వచ్చాడు. అయితే, ఇదే సమయంలో చెన్నయ్‌కి చెందిన డీజీ వెంచర్స్ నిర్వాహకుడు విజయ్‌సాహు బిపన్‌జైన్‌కు ఫోను చేశాడు. అతడితో నిందితుడు సోమాజీగూడలో ఉన్నట్లు చెప్పాడు. అయితే, గతంలో జైన్ చేతిలో మోసానికి గురైన విజయ్‌సాహు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న చార్మినార్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు ఆదాయపన్ను కూడా చెల్లించకుండా తన వ్యాపారాన్ని కొనసాగించాడని పోలీసులు తెలిపారు.