cow: పాల ఉత్పత్తిని అధికంగా రాబట్టడానికి ఒళ్లు గగుర్పొడిచే ప్రయోగాలు చేస్తోన్న పరిశోధకులు
పాల ఉత్పత్తిని అధికంగా రాబట్టడమే లక్ష్యంగా మూగజీవాలపై స్విట్జర్లాండ్ పరిశోధకులు దారుణమైన ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఆవులపై ఫిస్టులేషన్ అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టి, అందులో భాగంగా ఆవు పొట్ట భాగాన్ని కోసి జీర్ణాశయం లోపలికి పైపు వేసి పలు పదార్థాలు నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. తిన్న మేత ఆవు కడుపులో ఎంతమేర జీర్ణమైందో తెలుసుకునేందుకు కన్నం చుట్టూ రింగు వేసి మూత బిగిస్తున్నారు. ఇది ఆవు శరీరంపై సుమారు ఎనిమిది అంగుళాల వెడల్పున ఉంటోంది. ఇందు కోసం ఆవుల శరీర భాగాలను తొలగిస్తుండడంతో అవి తీవ్ర నొప్పితో గిజగిజలాడుతున్నాయి.
ఇక కన్నం నుంచి కడుపులోకి పలు పదార్థాలను పంపే సమయంలోనూ ఆవులు ఎంతో నొప్పి భరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఓ ఆవు నుంచి మరో ఆవుకు సూక్ష్మ జీవులను (మైక్రోబ్స్) మార్చవచ్చని వాటి ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ పద్ధతిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల జంతువులకు ఏ ప్రయోజనమూ ఉండదని ఆరోపిస్తున్నారు. ఆవులను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.