harish rao: మిషన్ కాకతీయ మొదటి దశలో ట్రాక్టర్లపై 3.5 కోట్ల ట్రిప్పుల మట్టిని తరలించాం: హరీశ్‌రావు
తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు అడిగిన మిషన్ కాకతీయ వివరాలపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పారు. జనవరి చివరి వారంలో మూడోదశ మిషన్ కాకతీయ పనులు ప్రారంభమవుతాయని అన్నారు. వర్షాభావం వల్ల నిండని చెరువుల పనులను ఈ దశలో చేపడతామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష చెరువుల పునరుద్ధరణేనని, అది సీఎం కేసీఆర్ ఆశయమని అన్నారు.
మిషన్ కాకతీయలో ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పారు. మిషన్ కాకతీయ మొదటి దశలో 3.5 కోట్ల ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని తరలించామని, ఇప్పుడు రెండో దశ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రెండో దశలో ఇప్పటివరకు 2.5 ట్రిప్పుల మట్టిని తరలించామని అన్నారు. జియో ట్యాగింగ్ విధానం వల్ల చెరువుల ఆక్రమణలను, అక్రమాలను అడ్డుకుంటున్నామని చెప్పారు. మిషన్ కాకతీయ రెండోదశకు రూ.3130 కోట్లు కేటాయించామని అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి చెరువుల వివరాలే తెలియని పరిస్థితి ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు.