govt web: పెద్దనోట్ల రద్దుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకి కొన్ని ఇబ్బందులు వచ్చాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ తాను ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశానని చెప్పారు. నోట్ల రద్దు అనంతరం చేపట్టాల్సిన చర్యలను గురించి ప్రధానికి తాను సూచించినట్లు తెలిపారు.
నవంబరు 26, 27న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి పెద్దనోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులపై లేఖ రాశారని కేసీఆర్ చెప్పారు. చిన్ననోట్లను పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు రాష్ట్రానికి నగదు పంపుతామని తెలిపిందని చెప్పారు. ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నామని అన్నారు. రాష్ట్ర అవసరాలకు పంపుతున్న నోట్లలో జాప్యం అంశాన్ని కూడా తెలిపామని చెప్పారు. ఏటీఎంలలో డబ్బు కొరతపై ప్రస్తావించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి తాము చేసిన విజ్ఞప్తితో పాతనోట్ల ద్వారా పన్నుల చెల్లింపు వెసులుబాటు వచ్చిందని చెప్పారు.
బ్యాంకుల ముందు మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఉండాల్సిందిగా తాము బ్యాంకర్లను కోరినట్లు కేసీఆర్ తెలిపారు. నగదురహిత లావాదేవీలు జరపడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చాయని అన్నారు. సిద్ధిపేటలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని నగదురహిత గ్రామంగా మార్చామని అన్నారు. అన్ని గ్రామాల్లో నగదురహిత లావాదేవీలు జరిపేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.