demonitization: అన్ని విషయాలు బయటికి చెప్పరు.. ఇదొక వ్యూహం, మనకు వేరే ఆప్షన్ లేదు: పెద్దనోట్ల రద్దుపై కేసీఆర్
ప్రధానమంత్రి మోదీ తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయం అద్భుతమైనదని, అది విజయం సాధిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎంత త్వరగా నగదురహిత లావాదేవీలు పెంచితే అంత త్వరగా మంచి జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని, సైబర్ క్రైం మీద కూడా దృష్టిపెట్టారని, ఆయన అమాయకులు కారని అన్నారు. పెద్దనోట్ల రద్దు అంశంపై అన్ని విషయాలూ బయటికి చెప్పబోరని, ఇదొక వ్యూహమని, ముందుగానే చెబితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ఫాలో కావడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదని అన్నారు. దేశంలో జరుగుతున్న అక్రమాలు ఆపాలనే ఈ చర్యకు దిగారని పేర్కొన్నారు.
డిసెంబరు 30 తరువాత పెద్ద ఎత్తున వాటిపై అవగాహన కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలను కష్టపెట్టాలని తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. మోదీ తనకు 50 రోజులు టైమ్ ఇవ్వమన్నారని, సహనంతో ఉందామని పేర్కొన్నారు. బంగారం మీద కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదని, దానిపై ఆందోళన వద్దని అన్నారు. నగదు రహిత లావాదేవీలు అంటే కేవలం స్వైపింగ్ మిషన్లే కాదని కేసీఆర్ అన్నారు.
ఎంత త్వరగా నగదురహిత విధానాన్నిఅమలు చేస్తామో అంతత్వరగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని చెప్పారు. మొబైల్ యాప్ల ద్వారా ఎంతో సురక్షితంగా మూడు నిమిషాల్లో నగదు బదిలీ చేసుకోవచ్చని అన్నారు. దేశంలో 15లక్షల స్వైపింగ్ మిషన్లు ఉన్నాయని, అయితే దేశంలో మొత్తం 10 కోట్ల స్వైపింగ్ మిషన్లు అవసరమవుతాయని అన్నారు. స్వైపింగ్ మిషన్లని ఇచ్చే పని ప్రభుత్వానిది కాదని, బ్యాంకులే ఆ వ్యవహారాలు చూసుకుంటాయని చెప్పారు. వాటిని బ్యాంకులే సరఫరా చేస్తాయని, ఈ విషయంపై బ్యాంకర్లతో ఇప్పటికే చర్చించానని అన్నారు. చెక్కులు, స్వైపింగ్ మిషన్లు, మొబైల్ యాప్లు లాంటి అనేక విధాల ద్వారా నగదురహిత లావాదేవీలు జరపవచ్చని అన్నారు.