demonitisation: ఈ రోజు ఉదయం అన్ని ఏటీఎంలలోనూ డబ్బు పెట్టారు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో నగదు రహిత లావాదేవీలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. రాష్ట్రానికి శనివారం రూ.25,000 కోట్లు వచ్చాయని వాటిని అన్ని బ్యాంకులకు పంపిణీ చేశామని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన నగదులో రూ.500 కోట్లు 5 వందల రూపాయల నోట్లే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం అన్ని ఏటీఎంలలోనూ డబ్బు పెట్టారని చెప్పారు. ప్రజలు పడుతున్న కష్టాలు తొలగడానికి అధికంగా ఆన్లైన్ లావాదేవీలు చేస్తే బాగుంటుందని చెప్పారు.
నగదురహిత చెల్లింపులకు ఇస్తోన్న ప్రోత్సాహకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఏపీలోని అన్ని రైతు బజార్లపైనా అధికారులు దృష్టి పెట్టాలని, నగదురహిత లావాదేవీలు జరిగేలా చేయాలని అన్నారు. రైతు బజార్లలో ఉచిత వై ఫై సదుపాయం కల్పించాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల్లో వైఫై సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు.