demonitization: ఎగుమతి దారుడి వ‌ద్ద ఏకంగా 40 కేజీల బంగారం... అరెస్టు


పెద్దనోట్ల ర‌ద్దు త‌ర‌వాత విస్తృతస్థాయిలో సోదాలు నిర్వ‌హిస్తోన్న అధికారుల‌కు భారీ మొత్తంలో బంగారం ప‌ట్టుబ‌డుతోంది. తాజాగా నోయిడాలో ఓ ఎగుమతి దారుడి వ‌ద్ద ఏకంగా 40 కేజీల బంగారం ఉంద‌ని గుర్తించిన ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు దాడులు నిర్వ‌హించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశంలో న‌ల్లకుబేరుల వద్ద ఉన్న నల్లధనాన్ని బంగారంగా మార్చే క్ర‌మంలోనే ఆ వ్య‌క్తి విదేశాల నుంచి ఈ బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. నోయిడాలోని స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఎన్‌ఎస్‌ఈజెడ్‌)లో ప‌నిచేస్తున్న ఈ నిందితుడు దేశీయ‌ మార్కెట్‌కు బంగారం పంపిణీ చేస్తుంటాడు.

 ఈ బంగారాన్నంతా దుబాయి నుంచి దిగుమ‌తి చేసుకున్నాడు. బంగారు ఆభరణాలు తయారు చేసి మ‌ళ్లీ దుబాయ్‌కి వాటిని ఎగుమ‌తి చేయాల్సి ఉంటుంది. అయితే, దేశంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నిందితుడు దేశీయ మార్కెట్లోకి దాదాపు రూ.150 కోట్ల విలువైన బంగారం తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. న‌ల్ల‌కుబేరులకు ఈ బంగారాన్ని అందిస్తూ వారి వ‌ద్ద ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని బంగారం రూపంలోకి మార్చుకునేందుకు స‌హ‌క‌రిస్తున్నాడ‌ని అధికారులు తెలుసుకున్నారు. నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు అత‌డిని అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకెళ్లారు. త‌రువాత అత‌డిని రిమాండ్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News