demonitisation: బ్యాంకు ఖాతాదారుల‌కు మ‌రో భారీ షాక్‌.. ఆందోళ‌న‌కు దిగ‌నున్న బ్యాంకు ఉద్యోగులు


పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో డ‌బ్బు దొర‌క్క తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మ‌రో షాకింగ్ న్యూస్‌ తెలిపారు. త్వ‌ర‌లోనే తాము పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగ‌నున్న‌ట్లు ప్రకటించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము పోరుబాట ప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. మరో పదిరోజుల్లో రద్దయిన పెద్దనోట్లను మార్చుకునేందుకు గడువు ముగుస్తుండడం, బ్యాంకు ఉద్యోగులు నిరంతరం పనిచేసినప్పటికీ ప్రజలకి కనీస అవసరాలకి సైతం డబ్బు దొరకకపోతుండడం వంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేసిన ఈ ప్రకటన ఆందోళన కలిగిస్తోంది.

 ఈ ఉద్య‌మంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్  సహా వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన‌నున్నారు. త‌మ ఆందోళ‌న‌ను డిసెంబర్ 28న ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. అదే రోజు నిర‌స‌న‌ను తెలిపి, డిసెంబర్ 29న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని క‌లిసి త‌మ స‌మ‌స్య‌ల‌పై ఒక లేఖను ఇస్తామ‌ని ఆయా యూనియన్లు ప్రకటించాయి. అనంత‌రం వ‌చ్చే నెల 2 , 3వ తేదీల్లోనూ ఆందోళనలో పాల్గొంటామ‌ని హెచ్చ‌రించాయి. ఇందుకు సంబంధించిన‌ ఒక ప్రకటనను స‌ద‌రు యూనియ‌న్లు ఈ రోజు విడుద‌ల చేశారు. భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకును తాము సరిపడా నగదు పంపిణీ చేయాల్సిందిగా కోరామ‌ని, కానీ అందులో అది విఫలమయింద‌ని వారు ఆరోపించారు.

డ‌బ్బు అందుబాటులో లేనప్పుడు ఆర్‌బీఐ ఆయా  కార్యాలయాల్లో లావాదేవీలను నిలిపివేయాల‌ని చెప్పాల్సింద‌ని వారు అన్నారు. అక్ర‌మార్కుల చేతికి పెద్ద‌నోట్లు చేరుతున్న నేప‌థ్యంలో వారిపై సీబీఐతో విచారణ జరిపించాలని వారు అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో విధి నిర్వహణలో మృతి చెందిన బ్యాంకు సిబ్బంది కుటుంబాలకు  ప్ర‌భుత్వం పరిహారం అందించాల‌ని పేర్కొన్నారు. భార‌త్‌లో మొత్తం 9 లక్షల బ్యాంక్ ఉద్యోగులు ఉండ‌గా, వారు రెండు సంఘాలుగా ఉన్నారు. ఆయా సంఘాల్లో మొత్తం 5.50 లక్షల మంది  సభ్యులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News