prianka chopra: ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ ను చూడడానికి నెటిజన్లు అధిక సంఖ్యలో గూగుల్‌లో సెర్చ్ చేశారట
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లోకి వెళ్లి బిజీబిజీగా మారిపోయిన నటి ప్రియాంక చోప్రా ఈ ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో తెల్లని దుస్తుల్లో దర్శనమిచ్చి తన అభిమానులని ఎంతగానో ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె వేసుకున్న డ్రెస్ ను చూడడానికి నెటిజన్లు అధిక సంఖ్యలో గూగుల్‌లో సెర్చ్ చేశారట. 2016లో తమ సెర్చింజన్లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలను గురించి గూగుల్ ఒక్కొక్కటీ ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ ట్రెండ్ ఫలితాలను ప్రకటించి, అందులో ప్రియాంక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ధరించిన దుస్తులు 2016 ‘మోస్ట్ సెర్చ్డ్ ఔట్ఫిట్’గా నిలిచాయని పేర్కొంది.
ఈ అంశంపై స్పందించిన లాస్ఏంజెల్స్లోని ఆమె స్టైలిస్ట్ సోఫియా బ్యాంక్స్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ డ్రెస్ ను ప్రియాంక ఎంతో ముందుచూపుతో ఆలోచించి ఎంచుకున్నట్లు తెలిపారు. తెలుపు రంగులో ఉన్న డ్రెస్ తనకు బాగా సరిపోతుందని ప్రియాంక అప్పట్లో అన్నారని, ఇప్పుడు ఆ రంగు డ్రెస్సే ట్రెండ్‌లో ఉందని అన్నారని చెప్పారు. తెలుపు రంగును చూస్తే తొలిచూపులోనే ఇష్టపడతారని ప్రియాంక తనకు చెప్పారని సోఫియా తెలిపారు. యూ ట్యూబ్ సీరియల్ ‘క్వాంటికో’, హాలీవుడ్ సీరియల్ ‘బేవాచ్’ షూటింగ్లలో పాల్గొంటూనే ప్రియాంక మాంట్రియల్‌కి వెళ్లి డ్రెస్ ఫిట్టింగ్‌ను చూసుకునేవారని, పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌కి ఎన్నో మార్పులు చేసి, ఫొటోలు తీసి మరీ చూసుకున్నారని ప్రియాంక గురించి సోఫియా వివరించారు.