nokia: ‘మా పేటెంట్ హక్కులను వాడుకుంటోంది’.. ఆపిల్‌పై నోకియా ఫిర్యాదు
తమ కంపెనీకి చెందిన పలు పేటెంట్లను ఆపిల్ సంస్థ చోరీ చేసిందని నోకియా ఆరోపణలు చేస్తోంది. ఇందుకు సంబంధించి అమెరికా, జర్మనీలో ఆపిల్ కంపెనీపై తాము ఫిర్యాదులు దాఖలు చేసినట్టు పేర్కొంది. తాము పేటెంట్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్, పర్సనల్ కంప్యూటర్ల వంటి పలు కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన 32కు పైగా పేటెంట్లను ఆపిల్ కంపెనీ ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది. 20 ఏళ్ల తమ ఇండస్ట్రిలో తమ కంపెనీ ఎన్నో పరిశోధనలు చేసిందని, అందుకోసం దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పిన నోకియా... వాటి ఫలితంగా సృష్టించిన పలు ఫండమెంటల్ టెక్నాలజీస్లపై వేలకొలది పేటెంట్ హక్కులను పొందామని, అయితే వాటిని ఇప్పుడు ఆపిల్ సహా ఎన్నో మొబైల్ డివైజ్‌లు వాడుతున్నాయని నోకియా చెప్పింది.
తాము పేటెంట్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న టెక్నాలజీస్‌ను వాడుకుంటన్న ఆపిల్‌తో తాము ఓ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరిపామని నోకియా తెలిపింది. కానీ ప్రస్తుతం పలు కారణాల వల్ల తమ టెక్నాలజీస్‌ను వాడుకుంటున్నందుకు చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని పేర్కొంది. నోకియా 2009లోనూ ఇటువంటి ఆరోపణలతో ఆపిల్ కంపెనీపై ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి ఆపిల్ కూడా నోకియాపై కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. అయితే అనంతరం రెండు సంవత్సరాల తరువాత ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదరి, ఆ పేటెంట్ వివాదం ముగిసింది. ఇప్పుడు మళ్లీ యాపిల్‌పై నోకియా ఈ ఆరోపణలు చేస్తోంది.