airlines: అర్థంకాని భాషలో మాట్లాడుతున్నాడ‌ని ఫిర్యాదు.. 'యూట్యూబ్‌' స్టార్‌ను విమానంలోంచి దించేసి తనిఖీ చేసిన సిబ్బంది


అరబిక్‌లో మాట్లాడినందుకు గానూ ఓ యూ ట్యూబ్ స్టార్‌ను విమానంలోంచి దించేసిన ఘ‌ట‌న లండన్‌ నుంచి నూయ్యార్క్‌కు బ‌య‌లుదేరిన‌ డెల్టా ఎయిర్‌లైన్స్  విమానంలో చోటుచేసుకుంది. యెమెన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబ్‌స్టార్‌ ఆడమ్‌ సాలే నిన్న స‌దరు విమానం ఎక్కాడు. అయితే ఆ స‌మ‌యంలో త‌న త‌ల్లితో ఫోన్‌లో అర‌బిక్ భాష‌లో మాట్లాడాడు. దీనిపై తోటి ప్ర‌యాణికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ అర్థంకాని భాషలో మాట్లాడుతున్నాడ‌ని ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో అత‌డిపై అనుమానం వ‌చ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అత‌డిని విమానం నుంచి దించివేసి త‌నిఖీలు చేశారు.

ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసిన ఆడమ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ‘బాయ్‌కాట్‌ డెల్టా’ పేరిట హ్యాష్‌ టాగ్‌తో ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో దాదాపు 2.2మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారి 2 లక్షల రీట్వీట్స్ వ‌చ్చాయి. త‌న‌ను విమానం నుంచి దింపేసిన అనంత‌రం ఆడమ్‌ మరో విమానంలో న్యూయార్క్‌ చేరుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది.. విమానంలో అత‌డితో పాటు ఉన్న‌ 20 మంది ప్రయాణికులు తమకు ఇబ్బందికరంగా అనిపిస్తోందని ఫిర్యాదు చేయడంతోనే తాము ఆడ‌మ్‌ను దించేశామ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News