crime: ఆస్తికోసం సొంత సోదరుడిని 20 ఏళ్ల పాటు గృహనిర్బంధంలో ఉంచిన వ్యక్తి
కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకొచ్చింది. జిల్లాలోని రాయబాగ్ తాలూకా అళగవాడి గ్రామంలో ఓ వ్యక్తిని తన సొంత సోదరుడే 20 ఏళ్లుగా గృహ నిర్బంధంలో ఉంచాడు. నిందితుడి ఇంటికి సమీపంలోనే ఓ పాఠశాల ఉంది. దానిని పరిశీలించేందుకు తహసీల్దార్ రాజశేఖర్ టీమ్ అక్కడకు వెళ్లింది. వారికి బాధితుడు గొలుసులతో కట్టబడి ఉండడం కనిపించింది. దీంతో అతడికి విముక్తి లభించింది. అనంతరం బాధితుడి గురించి రెవెన్యూ అధికారులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
సదరు బాధితుడిని 50 ఏళ్ల నీలకంఠ హంజేగా వారు గుర్తించారు. ఆస్తిని కొట్టేయాలనే దురుద్దేశంతోనే అతడి సొంత సోదరుడు 20 ఏళ్లుగా నీలకంఠను గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలుసుకున్నారు. అళగవాడి గ్రామ పరిధిలోని ఓ తోటలో నిందితుడి కుటుంబం ఉంటుందని, అక్కడే నీలకంఠను తాము గుర్తించినట్లు వారు తెలిపారు. బాధితుడికి ఆసుపత్రిలో ప్రథమ చికిత్సలు జరిపించి, తరవాత బెళగావి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. నీలకంఠ హంజె మానసిక పరిస్థితి కూడా అంతగా బాగాలేదని తెలుస్తోంది.