gold rate: మరింత పడిపోయిన బంగారం ధరలు
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రోజురోజుకీ దిగుతూ వస్తోన్న బంగారం ధర ఈ రోజు మరింత దిగజారి 11 నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.27,500గా నమోదయింది. దేశీయ మార్కెట్లో నగల దుకాణదారుల నుంచి డిమాండ్ తగ్గుతుండడంతో పసిడి ధరల పతనం అలాగే కొనసాగుతోందని, దీంతో మార్కెట్లో ఈ రోజు బంగారం ధర మరో 250 రూపాయలు తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక మార్కెట్ లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 250 తగ్గి రూ.27,550 వద్ద కొనసాగుతుండగా, 99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రా. బంగారం 27,400 రూపాయలుగా నమోదయింది.
మరోవైపు మార్కెట్లో వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర మరో రూ.210 తగ్గి రూ.38,600గా ఉంది. బంగారం దుకాణాదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు దేశంలో పెద్దనోట్ల రద్దు ప్రభావం ధరల పతనానికి కారణమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.