udhav: మరోసారి దేశంలోని సామాన్యులను కష్టాల పాలు చేస్తారా?: శివసేన


కేంద్ర స‌ర్కారు తీసుకురావాల‌ని చూస్తోన్న బినామీ వ్య‌తిరేక చ‌ట్టంపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే విమ‌ర్శ‌లు గుప్పించారు.
దేశంలో బినామీ ఆస్తులను నిర్మూలిస్తామ‌నే పేరుతో పేదలను నగ్నంగా నిలబెడ‌తారా? అని త‌మ పార్టీ అధికార పత్రిక సామ్నా ద్వారా ప్ర‌శ్నించారు. పెద్దనోట్ల రద్దు అనంత‌రం దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ని,  బినామీ వ్య‌తిరేక చ‌ట్టం తీసుకొచ్చి మ‌ళ్లీ వారిని ఇలాంటి క‌ష్టాల‌కే గురిచేయ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. దేశంలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు న‌ల్ల‌ధ‌నం ఉన్నవారు ఇప్ప‌టికే వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారని ఆయ‌న అన్నారు. మ‌రోవైపు దురదృష్టవశాత్తు సామాన్యులు క‌ష్టాలుప‌డ్డార‌ని ఆయ‌న చెప్పారు. బినామీ ఆస్తుల పేరుతో... పేదల చడ్డీ, బనియన్లను కూడా తొలగించాలని చూడకూడదని ఆయన అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న రూ.500, 1000 నోట్ల ర‌ద్దు నిర్ణయంతో సామాన్యుల ఇబ్బందులు మ‌రింత అధిక‌మ‌య్యాయే త‌ప్ప‌, ఇంత‌వ‌ర‌కు ఒక్క‌పైసా న‌ల్ల‌ధ‌నం కూడా ఖజానాకు రాలేద‌ని ఉద్ధవ్ థాకరే విమ‌ర్శించారు. ఇంత‌వ‌ర‌కు స‌ర్కారు ఒక్క పారిశ్రామికవేత్తను కూడా శిక్షించలేదని అన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు మోదీ చేసిన హామీ ఇంత‌వ‌ర‌కు నెర‌వేర‌లేద‌ని, ఇంత‌వ‌ర‌కు విదేశీ బ్యాంకుల్లో ఉన్న న‌ల్ల‌ధ‌నం ఒక్క పైసా కూడా రాలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

పీవోకేలోకి ప్ర‌వేశించి భార‌త సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన త‌రువాత కూడా పాకిస్థాన్ ఉగ్ర‌వాద చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయ‌ని ఉద్ధ‌వ్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు  పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదం 50 మందికి పైగా మ‌న‌దేశ‌ సైనికుల మృతికి కార‌ణ‌మ‌యింద‌ని అన్నారు. అలాగే, కశ్మీరీ పండిట్లకు చట్టబద్ధంగా రావాల్సిన ఆస్తులు వారికి దక్కేలా చూడాల‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News