demonitisation: మోదీ సంచలన ప్రకటనకు 3 గంటల ముందే ఆర్‌బీఐ ‘పెద్దనోట్ట రద్దు’కు ఆమోదం తెలిపిందట!
దేశంలో పెద్దనోట్ల రద్దు అంశంపై బ్లూమ్‌బర్గ్ న్యూస్ సంస్థ సమాచార హక్కుచట్టం కింద అడిగిన ప్రశ్నలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సమాధానం ఇచ్చింది. నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటన చేయడానికి కేవలం మూడు గంటల ముందే తాము ఆమోదం తెలిపామని ఆర్‌బీఐ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని దేశంలో ఎంతమంది స్వాగతించారు? ఎంతమంది వ్యతిరేకించారు? అనే అంశాలపై తాము వివరణ ఇవ్వలేమని, ఆ విషయాన్ని తాము రికార్డు చేయలేదని అన్నారు.
నవంబర్ 8న రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం జరిగిందని అందులోనే తాము పెద్దనోట్ల రద్దుపై నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ వివరించింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారి వివరాలను గురించి తెలుపుతూ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్‌పటేల్, ఆర్‌బీఐ ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఆర్. గాంధీ, ఎస్.ఎస్. ముంద్రా, ఎన్.ఎస్. విశ్వనాథన్ సహా పలువురు ఆర్థిక నిపుణులు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పాల్గొన్నారని చెప్పింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన గందరగోళం కారణంగా తాము రోజుకు ఎన్ని రూ.2000, రూ.500 కొత్త నోట్లను ముద్రిస్తున్నామో వెల్లడించలేమని ఆర్‌బీఐ పేర్కొంది.