demonitisation: ఇకపై రూ.500 నోట్లు పెద్ద ఎత్తున వచ్చేస్తాయి: అరుణ్ జైట్లీ
దేశంలో నల్లధనాన్ని అంతమొందించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఈ రోజు న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజలకు అవసరమైనంత కరెన్సీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద అందుబాటులో ఉందని చెప్పారు.
కొత్తగా ముద్రించిన రూ.500 నోట్లు ఇకపై పెద్ద ఎత్తున చలామణిలోకి రానున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది పెరిగిన పన్నుల వసూళ్ల గురించి తెలిపిన జైట్లీ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గతేడాదితో పోల్చితే 13.6 శాతం పెరిగినట్టు తెలిపారు. గతనెల 30 నాటికి కేంద్ర పరోక్ష పన్నులు 26.2శాతం పెరిగితే, అబ్కారీ పన్నులు 43.5 శాతం పెరిగాయని చెప్పారు. ఇక సర్వీసు పన్ను 25.7 శాతం, కస్టమ్స్ డ్యూటీ 5.6 శాతం పెరిగిందని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రబీ సాగు 6.3 శాతం పెరిగినట్టు ఆయన పేర్కొన్నారు.