demonitization: రద్దయిన నోట్లు కలిగి ఉంటే జైలు శిక్ష విధింపు నిబంధన తొలగింపు.. కాసేపట్లో రాష్ట్రపతి వద్దకు ఆర్డినెన్స్.. ఎల్లుండి నుంచే అమలు
దేశంలో పెద్దనోట్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకుని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కేంద్ర ప్రభుత్వం అందుకు కొనసాగింపుగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సంకేతాలు వస్తోన్న విషయం తెలిసిందే. ఏ నిబంధనలు లేకుండా బ్యాంకుల్లో డబ్బును జమ చేసుకునేందుకు ఖాతాదారులకు ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఎల్లుండి నుంచి ఆర్‌బీఐ కౌంటర్లలో మాత్రమే పాతనోట్లను జమచేసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లను కలిగి ఉంటే నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అత్యవసర ఆదేశం కాసేపట్లో రాష్ట్రపతి వద్దకు చేరనుంది.
ఎల్లుండి నుంచే ఈ ఆర్డినెన్స్ ను అమలులోకి తీసుకురానున్నారు. అయితే, పాతనోట్లు కలిగి ఉండి పట్టుబడితే నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ నుంచి తొలగించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మీడియాకు చెప్పింది. అలాగే పాత నోట్లతో లావాదేవీలు జరిపితే రూ.5 వేల జరిమానా విధిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ జరిమానాను 10 వేల రూపాయలకు పెంచింది.