online transactions: ఇదీ మన భద్రత.... కేవలం మూడు గంటల్లోనే ఓ బ్యాంకు సైట్‌ను హ్యాక్ చేసిన ఎథికల్ హ్యాకర్లు!
దేశ ప్రజలను నగదురహిత లావాదేవీల వైపుకు నడిపించాలన్నదే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. అవినీతి, నల్లధనం, నకిలీ నోట్ల వంటి అభివృద్ధి నిరోధక అంశాలను డిజిటల్ లావాదేవీల ద్వారా నిరోధించవచ్చని కేంద్ర సర్కారు యోచన. అయితే, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లు ఎంతవరకు భద్రం? ప‌్రస్తుతం అందరినీ కలవరపెడుతున్న ప్రశ్న ఇది. ఈ సవాలునే గట్టిగా విసిరారు కొంతమంది ఎథికల్ హ్యాకర్లు. బ్యాంకుల సైట్లు హ్యాకింగ్ కు గురయ్యేందుకు అనుకూలంగా ఉన్నాయని నిరూపించి చూపించారు. కేవలం మూడు గంటల్లోనే ఓ బ్యాంకు సైట్‌ను హ్యాక్ చేసి 'ఇదీ మీ భద్రత' అంటూ తేల్చి చెప్పారు. గుర్గావ్‌లోని ఎథికల్ హ్యాకింగ్ సంస్థ పలు కంపెనీలకు వచ్చే హ్యాకింగ్ సమస్యలు, ఇతర సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరిస్తుంటుంది.
దేశాన్ని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌ల వైపుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతున్న వేళ ప్రజల ఆన్‌లైన్ లావాదేవీలు ఎంతమేరకు భద్రం అనే అంశాన్ని పరీక్షించింది. ఐదుగురు ఎథికల్ హ్యాకర్లతో కలిసి ఈ పరీక్ష చేయించి సక్సెస్ అయి సవాలు విసిరింది. సంస్థలోని హ్యారీ (హర్జిత్) అనే ఓ ఎథికల్ హ్యాకర్ ఓ బ్యాంకు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. కేవలం మూడు గంటల్లోనే బ్యాంకు ఖాతాదారులు చేసే ఆన్‌లైన్ లావాదేవీలకు స్పందించే రూటర్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
ఈ అంశంపై హ్యారీ మాట్లాడుతూ... బ్యాంకు ఖాతాదారుల విజ్ఞప్తులను రూటరే బ్యాంకుకు ఆదేశిస్తుందని, అదే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ను నడిపిస్తుందని చెప్పాడు. తాను హ్యాక్ చేయడం ద్వారా ఆ రూటర్‌కు సంబంధించిన పాస్ వర్డు కనుక్కోగలిగానని, ఇప్పుడు తాను ఆ రూటర్‌ను తన ఇష్టం వచ్చినట్లుగా నియంత్రించగలనని చెప్పాడు. సదరు బ్యాంకు ఖాతాదారుడి రిక్వెస్ట్‌ను ఇతర ప్రైవేట్ సైట్‌కు కేటాయించి వారి ద్వారా ఖాతాదారుడి బ్యాంకు లాగిన్ పాస్‌వర్డ్ అడిగి అన్నింటిని కనిపెట్టగలనని పేర్కొన్నాడు. ఇలా సదరు బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుల ఖాతాల నుంచి నగదునంతా కాజేయొచ్చని తెలిపాడు. బ్యాంకు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి డబ్బు కాజేయడం తన ఉద్దేశం కాకపోయినా, దేశంలోని నగదురహిత విధానం భద్రత డొల్లతనాన్ని చాటి చెప్పడానికే ఇలా హ్యాకింగ్ చేశానని అన్నాడు. ఇలా చెప్పడం ఎథికల్ హ్యాకర్‌గా తమ బాధ్యత అని చెప్పాడు.