jio: నిబంధనలను ఉల్లంఘించలేదు.. మా ఆఫర్ కొనసాగుతుంది: రిలయన్స్ జియో
ఉచిత మంత్రంతో మార్కెట్లోకి వచ్చి మిగతా టెలికాం కంపెనీలకు తీవ్ర పోటీనిచ్చిన రిలయన్స్ జియోను తమకు పలు అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కోరిన విషయం తెలిసిందే. రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను తీసుకొచ్చి తాము అందిస్తోన్న 90 రోజుల ఉచిత డేటా, వాయిస్ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగతా టెలికాం కంపెనీల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆఫర్ నిబంధనల ఉల్లంఘన కిందకు ఎలా రాదో జియో తమకు తెలపాలని ట్రాయ్ పేర్కొంది. దీంతో స్పందించిన రిలయన్స్ కంపెనీ జియో ఆఫర్లపై వివరణ ఇచ్చారు.
ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులే ఉండాలన్న ట్రాయ్ నిబంధనలను తాము ఉల్లంఘించలేదని అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తేల్చిచెప్పింది. తాము మొదట ప్రకటించిన ‘వెల్ కమ్ ఆఫర్’, తమ తాజా 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్' రెండూ వేరు వేరని పేర్కొంది. తమ ఆఫర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తమ ప్రమోషనల్ ఆఫర్ కు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ భిన్నమైందని తెలిపింది. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా తాము హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను తీసుకొచ్చామని, దీనిని దోపిడీగా లెక్కించడం తగదని ట్రాయ్ కు వివరించింది.