amar singh: నన్ను ఓ విలన్‌గా చిత్రీకరిస్తున్నారు: 'సమాజ్ వాదీ' సంక్షోభం నేపథ్యంలో అమర్‌సింగ్
సమాజ్‌వాదీ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమర్‌సింగ్ లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన స్పందిస్తూ పార్టీలో, ములాయం కుటుంబంలో నెలకొన్న కలహాలకు తాను కారణం కాదని వ్యాఖ్యానించారు. తనపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, తనను ఇలా బతకనివ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబంలో నెలకొన్న విభేదాలకు తానే కారణమని ములాయం సింగ్ యాదవ్ భావిస్తే తనను పార్టీ నుంచి పంపించేయవచ్చని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తనను ఓ విలన్‌గా చిత్రీకరిస్తున్నారనీ అమర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణల నుంచి తనను కాపాడాలని ములాయం సింగ్‌ను కోరారు. ఇటీవలే ములాయం సింగ్ అసెంబ్లీ ఎన్నికల జాబితాను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ అభ్యర్థుల జాబితా గురించి తనకు తెలియదని అమర్‌సింగ్ అన్నారు. జాబితాలో ఎవరికి టిక్కెట్లు దక్కాయో, ఎవరికి దక్కలేదో కూడా తనకి తెలియదని చెప్పారు. కొందరు వ్యక్తులు తనపై ఆరోపణలు గుప్పిస్తూ తనకు వ్యతిరేకంగా పోస్టర్లు ముద్రిస్తూ, తన దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.