india: అంత్యక్రియలు నిర్వహించాలి.. కాల్పులు ఆపండి!: సరిహద్దులో పాక్ రేంజర్లను వేడుకున్న ప్ర‌జ‌లు


భార‌త్, పాకిస్థాన్‌ నియంత్రణరేఖ (ఎల్‌వోసీ)ని ఆనుకుని ఉన్న నూర్‌కోటే గ్రామంలో ఇటీవ‌లే కనిపించిన ఓ దృశ్యం జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎటువంటి ప‌రిస్థితులు ఉన్నాయో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తోంది. భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పీవోకేలోకి ప్ర‌వేశించి ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన త‌రువాతి నుంచి సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా పాకిస్థాన్‌ రేంజర్లు కాల్పుల‌కు పాల్ప‌డుతూ మ‌రింత రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. నాలుగురోజుల క్రితం పాక్ రేంజ‌ర్లు జరిపిన కాల్పుల్లో నూర్‌కోటేకు చెందిన తన్వీర్ (16) ప్రాణాలు కోల్పోయాడు. పూంచ్‌ జిల్లా హవేలీలో ఈ నూర్‌కోటే గ్రామం ఉంటుంది. భార‌త్‌, పాక్ కంచె వెంబడి ఉన్న పొలంలో ఆ బాలుడి అంత్య‌క్రియల‌ను నిర్వ‌హించాల‌ని అత‌డి కుటుంబ స‌భ్యులు భావించారు.

శుక్ర‌వారం జనాజా ప్రార్థన ముగిసిన అనంత‌రం అత‌డి అంతిమ యాత్ర ప్రారంభ‌మ‌యింది. అదే స‌మ‌యంలో పాక్ రేంజ‌ర్లు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్ప‌డింది. దీంతో మత పెద్దలు మసీదులోని మైక్ వ‌ద్ద‌కు వెళ్లారు. త‌మ బాలుడిని పాక్ రేంజ‌ర్లు కాల్చిచంపారని, ఇప్పుడు ఆ బాలుడి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామ‌ని, కాల్పులు ఆపాల‌ని వేడుకున్నారు. దీంతో పాక్ రేంజ‌ర్లు కొద్దిసేపు కాల్పులు ఆపేశారు. వెంటనే అంత్యక్రియలు ముగించుకున్న‌ గ్రామస్తులు తిరిగి త‌మ ఇళ్ల‌కు వెళ్లి పోయారు. ఆయా గ్రామాల ప్ర‌జ‌లు ప్ర‌తిరోజు ఇటువంటి దుర్భ‌ర ప‌రిస్థితుల‌నే చ‌విచూడాల్సి వ‌స్తుంద‌ని స్థానిక ఎమ్మెల్సీ జహంగీర్‌ మీర్ అన్నారు. స‌రిహ‌ద్దు గ్రామ‌ల ప్ర‌జ‌లు ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందోన‌ని బిక్కుబిక్కుమంటూ త‌మ జీవితాలను నెట్టుకొస్తున్న‌ట్లు ఈ ఘ‌ట‌న ద్వారా మ‌రోసారి తెలిసింది.  

  • Loading...

More Telugu News