fight aginst terrotism: ఉగ్రవాదులను హతమార్చేందుకు సిద్ధమైన 45 మంది మహిళలు!
ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదుల దాడులతో అఫ్ఘానిస్థాన్‌లో రక్తం ఏరులైపారుతున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఉగ్రవాదుల భయం ఆ దేశ ప్రజలను వెంటాడుతూనే ఉంది. దీంతో అక్కడి ప్రజలే సైనికుల్లామారి ఉగ్రవాదుల అంతు చూడడానికి సిద్ధపడుతున్నారు. అఫ్ఘనిస్థాన్ ఉత్తరాదిన ఉన్న జవ్‌జ్జాన్ ప్రాంతంలో తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదులపై తిరగబడడానికి మహిళలు ముందుకు వస్తున్నారు. ఆయుధాలను చేతపట్టి, అత్యాధునిక రైఫిల్స్‌ను ఉపయోగించడంలో శిక్షణ కూడా తీసుకున్నారు. సదరు మహిళలను వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కూడా ప్రోత్సహిస్తున్నారు.
ఈ క్రమంలో జర్మీనా (53) అనే మహిళా కమాండెర్ సారథ్యంలో తాలిబన్ల స్వాధీనం కాకుండా తమ ప్రాంతాలను రక్షించుకునేందుకు ఓ దళం కదిలింది. ఇందులో మొత్తం 45 మంది మహిళా ఫైటర్లు ఉన్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన మహిళలు ఈ పోరులో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. రెండేళ్ల క్రితం ఓ మహిళ తన కొడుకు హత్యకు ప్రతీకారంగా ఏకంగా 25 మంది తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చి అందిరితోనూ శభాష్ అనిపించుకుంది.