deal: చివరిదశకు చేరుకున్న రూ.4500 కోట్ల డీల్... భారీగా శతఘ్నుల కొనుగోలు!
శతఘ్నులను కొనుగోలు చేసేందుకు భారత్ కుదుర్చుకుంటున్న 4,500 కోట్ల రూపాయల విలువైన డీల్ చివరి దశకు చేరుకుంది. కేంద్ర సర్కారు సైనిక ఆధునికీకరణకు ప్రాధాన్యతనిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ భారీ డీల్ ముందుకు వెళుతోంది. వీటి ధరకు సంబంధించిన చర్చలు పూర్తికాగానే కేంద్ర కేబినెట్ సమావేశమై ఇందుకు ఆమోదం తెలపనుంది. ఈ డీల్ పూర్తయితే దేశీయ ఇన్ఫ్రా రంగ సంస్థ ఎల్&టీకి అతి పెద్దవిజయంగా నిలవనుంది. ఉత్తరకొరియాకు చెందిన హాన్వాటెక్విన్‌తో కలిసి ఎల్&టీ ఈ హోవిట్జర్ శతఘ్నులను దేశీయ అవసరాలకు తగ్గట్టుగా మార్చనుంది.
భారత్ సరిహద్దు దేశాలయిన పాకిస్థాన్, చైనాలు తమ సైనికశక్తిని పెంచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కూడా సైనిక ఆధునికీకరణకు వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. దాదాపు 100 శతఘ్నులకు సంబంధించిన ధరను ఎల్&టీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయగానే సదరు ఫైల్ కేంద్ర మంత్రివర్గ కమిటీ ముందుకు రానుంది. దీనికి రక్షణ మంత్రిత్వశాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలపాల్సి ఉంది. త్వరలోనే ఈ ఫైల్ ఆ శాఖ వద్దకు చేరుకుంటుంది.