google ceo: ఇక మొబైల్ సాయంతో కొన్ని నిమిషాల్లోనే వెబ్‌సైట్ రూపొందించుకోవచ్చు!: న‌్యూఢిల్లీలో గూగుల్ సీఈవో
డిజిటల్ భారత్‌గా అడుగులు వేస్తోన్న ఇండియాలో గూగుల్ సంస్థ మరో రెండు కొత్త యాప్‌లతో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభించనుందని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. న్యూఢిల్లీలో 'స్మాల్ అండ్ మీడియం బిజినెస్' సంస్థ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన ఆయన మాట్లాడుతూ... 'గూగుల్ మై బిజినెస్' పేరుతో ఒక యాప్‌ను ముందుగా భారత్‌లో విడుదల చేయనున్నట్లు, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ యాప్‌తో చిరువ్యాపారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఈ యాప్ ద్వారా వారు ఆన్‌లైన్‌లో తమ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవచ్చని చెప్పారు.
చిరువ్యాపారులు కేవలం మొబైల్ సాయంతో కొన్ని నిమిషాల్లోనే వెబ్‌సైట్ రూపొందించుకోవచ్చని చెప్పారు. ఈ యాప్‌ను భారత్‌లో విడుదల చేస్తే ఇక ప్రపంచంలో ఎక్కడైనా విడుదల చేయవచ్చని తాము తెలుసుకున్నట్లు వ్యాఖ్యానించారు.ఈ యాప్‌తోపాటు తమ సంస్థ ఫిక్కీ, ఐఎస్‌బీతో కలిసి డిజిటల్ అన్‌లాక్‌డ్ పేరుతో ఒక విద్యా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో వ్యాపారాలకు ఉపయోగపడే ఆన్‌లైన్ కోర్సులు ఉంటాయని ఆయన అన్నారు. గూగుల్ ఇండియా, దక్షిణాసియా విభాగాధిపతి రాజన్ ఆనంద్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ... ఎస్‌ఎంబీలు మొదటి నుంచి తమ ప్లాట్‌ఫామ్‌కు ప్రధానమైన యూజర్లుగా ఉన్నారని చెప్పారు.