indonesia: ఆ చిన్నారికి స్వయంగా దేశాధ్యక్షుడే కాల్‌ చేసి.. ఏడవకూడదని చెప్పారు!


ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ ఒక చిన్నారికి ఫోను చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. త‌న‌ను చూసే అవకాశం చేజారిందని ఏడ్చిన‌ నిషా అనే చిన్నారికి ఆయన స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. వివ‌రాల్లోకి వెళితే... జోకో విడొడొ గతనెల‌ 27న టొమొహొన్‌ నగరంలో పర్యటించారు. ఆ న‌గ‌రంలోనే చిన్నారి నిషా ఇల్లు ఉంటుంది. త‌మ వీధిలోకి త‌మ దేశ అధ్య‌క్షుడు వ‌స్తున్నాడ‌న్న విష‌యాన్ని తెలుసుకున్న నిషా ఆయ‌న‌ను చూడాలని ఎంత‌గానో ఎదురుచూసింది. అయితే, ఆయ‌న ఆ చిన్నారి ఇంటి ముందుకు వ‌చ్చేస‌రికి అనుకోకుండా నిషా ఇంట్లోకి వెళ్లిపోవడంతో చూడలేకపోయింది. దీంతో ఆయ‌న‌ను చూడలేకపోయానని వెక్కి వెక్కి ఏడ్చేసింది.  ఆయ‌న వ‌చ్చిన‌ప్పుడు తనని ఎందుకు పిలవలేదని తన తండ్రిని నిల‌దీసింది.
ఆ చిన్నారి ఏడుస్తుండ‌గా ఆమె తల్లి వీడియో తీసి అనంత‌రం దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఆ వీడియోని దాదాపు మూడు లక్షల మంది చూసి షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన వారిలో ఆ దేశ‌ ప్రెసిడెంట్‌ జోకో కూతురు కహియంగ్‌ అయు కూడా ఉన్నారు. దీంతో చిన్నారి నిషా వివరాలు త‌న‌కు తెలపాలని సోష‌ల్ మీడియా ద్వారా నెటిజన్లను కోరారు. చివ‌రికి నిషా ఇంటి ఫోన్‌ నంబర్ తెలుసుకున్నారు. ఇక తన తండ్రి అయిన‌ ప్రెసిడెంట్‌ జోకోను నిషాతో ఫోన్‌లో మాట్లాడించేలా చేశారు. దీంతో నిషా కుటుంబం మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయింది. నిషాతో ప్రెసిడెంట్ మాట్లాడుతుండ‌గా రికార్డు చేసిన సంభాష‌ణ‌ను ఆయ‌న కుమారుడు న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ‘ఏడవకూడదు.. బాగా చదువుకో’ అంటూ నిషాతో మాట్లాడిన సంభాషణ ఉంది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. తాజాగా నిషా కూడా ప్రెసిడెంట్‌ కుటుంబానికి కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పెట్టారు.

  • Loading...

More Telugu News