pak: కరాచీలో ఉన్న చైనా అణు జలాంతర్గామిని కనిపెట్టిన వ్యక్తి!


ఉపగ్రహ ఛాయాచిత్రాలను గుర్తించడంలో నిపుణుడైన ఒక వ్యక్తి గూగుల్ ఎర్త్‌లోకి వెళ్లి చూడ‌గా అత‌డికి పాకిస్థాన్‌లోని క‌రాచీ ఓడ‌రేవులో చైనాకు చెందిన అణు జలాంతర్గామి క‌నిపించింది. గూగుల్ ఎర్త్‌లో 2016 మే నాటికి వెళ్తే ఈ జలాంతర్గామి స్పష్టంగా కనిపిస్తుందని అత‌డు ర‌క్ష‌ణ రంగ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దాని సాయంతో చైనా ఇంతకుముందు కంటే ఇప్పుడు భారతీయ యుద్ధనౌకల కదలికలను మరింత దగ్గరనుంచి గ‌మ‌నిస్తున్న‌ట్లు స్పష్టమైంది. ఈ అణు జ‌లాంత‌ర్గాముల్లో రియాక్ట‌ర్ల కార‌ణంగా ఇంధ‌న‌కొర‌త అనే స‌మస్యే త‌లెత్త‌దు. అంతేకాదు, అణు జలాంతర్గాములు ఎంత దూరమైనా వెళ్లగ‌లుగుతాయి.

టోర్పడోలు, క్రూయిజ్ మిసైళ్లు ఉన్న ఈ జలాంతర్గాములను ఎంత‌కాలం అయినా స‌రే  నీటి అడుగునే ఉంచ‌వ‌చ్చు. అయితే, దీనిపై స్పందించిన ర‌క్ష‌ణశాఖ అధికారులు అటువంటి వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమేన‌ని, అక్క‌డ ఉన్నది అణుజలాంతర్గామేన‌ని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. అవి బాగా నిశ్శబ్దంగా ఉండి, ఏ మాత్రం గుర్తించడానికి వీలు లేకుండా ఉంటాయ‌ని చెబుతున్నారు. నౌకాదళం చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా గత నెలలోనే మాట్లాడుతూ... చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాముల కదలికలను భార‌త్ విమానాలు, నౌకల సాయంతో గ‌మ‌నిస్తూనే ఉంద‌ని చెప్పారు. అయితే, ఇప్పుడు ఈ అణు జలాంతర్గామి క‌రాచీలో ఉందంటూ వచ్చిన వార్త అల‌జ‌డి రేపుతోంది.

  • Loading...

More Telugu News