remote thief: టీవీ రిమోట్ చోరీ చేసినందుకు.. ఏకంగా 22 ఏళ్ల జైలుశిక్ష పడింది!
అతడో దొంగ.. పైగా అలాంటి ఇలాంటి దొంగ కాదు... ఎన్నో చోరీలకు పాల్పడి.. జైలుకి వెళ్లొచ్చాడు. ఆఖరికి టీవీ రిమోట్‌లను కూడా దొంగతనం చేస్తున్నాడు. చివరికి మరోసారి పోలీసులకి పట్టుబడడంతో అతడికి ఏకంగా 22 ఏళ్ల జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని చికాగో సిటీలో ఉండే ఎరిక్ బ్రామ్‌వెల్(35) కొన్నేళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. అందుకు గానూ పలుసార్లు పోలీసులకి చిక్కి జైలుశిక్ష అనుభవించాడు. రెండేళ్ల కిందట చికాగోలోని మెల్ రోస్ పార్క్ ఏరియాలో 100 బ్లాక్ ఆఫ్ క్రాస్ వీధిలోని ఓ అపార్ట్ మెంట్లో చోరీచేశాడు. చోరీ అంటే ఏ బంగారమో నగదో కాదు టీవీ రిమోట్‌ను చోరీ చేశాడు. అనంతరం అక్కడినుంచి తప్పించుకున్నాడు.
పదేపదే ఓ దొంగ ఇలాంటి చోరీలకే పాల్పడుతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌లో వేలిముద్రలు, కొన్ని వివరాలు సేకరించి, ఎరిక్ వేలిముద్రలు, డీఎన్‌ఏతో వాటిని పోల్చి చూశారు. చివరికి ఇటువంటి చోరీలకు పాల్పడుతోంది అతడే అని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. తాను ఆ అపార్ట్‌మెంటులో రిమోట్ చోరీచేసినట్లు ఎరిక్ ఒప్పుకున్నాడు. ఇటువంటి పలు చోరీలకు పాల్పడిన అతడికి చికాగో కోర్టు 22 ఏళ్ల జైలుశిక్ష విధించింది. పదేళ్ల శిక్ష అనుభవించిన తరువాత అతడికి పెరోల్ అవకాశం కల్పిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఆ దొంగ చేసిన తప్పిదాలన్నింటినీ తీసుకుంటే అతడికి 30 ఏళ్ల వరకు శిక్ష వేయవచ్చని ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాబర్ట్ బెర్లిన్ వాదించారు.