worship: దేవుడి విగ్రహం అనుకొని పొరపడింది.. కొన్నేళ్లపాటు పూజలు చేసింది!
బ్రెజిల్లో ఓ బామ్మ కొన్నేళ్లుగా ఓ విగ్రహానికి ఎంతో భక్తితో పూజలు చేస్తోంది. తాను పూజలు చేస్తోన్న విగ్రహం దేవుడిదే అనుకొంది. కానీ, చివరికి నిజం తెలిసి తాను ఇన్నాళ్లూ చేసిన పూజలు వృథా అయ్యాయని బాధపడిపోతోంది. బ్రెజిల్‌లోని ఫ్లోరినొపాలిస్ ప్రాంతానికి చెందిన గాబ్రిలా బ్రాండావొ అనే అమ్మాయి సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ ద్వారా ఈ విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే... గాబ్రిలా బ్రాండావొ వాళ్ల బామ్మ కొన్నేళ్లుగా సెయింట్ ఆంథోని విగ్రహం అనుకొని ఓ విగ్రహాన్ని పూజిస్తోంది. అయితే, గాబ్రిలాకు ఇటీవలే ఓ డౌట్ వచ్చింది. ఆ విగ్రహం నిజంగా ఆ దేవుడిదేనా? అన్నది ఆమె డౌటు!
దీంతో ఇంటర్నెట్లో ఆ విగ్రహం గురించి సెర్చ్ చేసింది. అప్పుడుగానీ తెలియలేదు అసలు విషయం. తన బామ్మ పూజిస్తోంది సెయింట్ ఆంథోని విగ్రహం కాదని, ఎల్రాండ్ అనే పాత్ర బొమ్మ అని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఎల్రాండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ చిత్రంలోని ఓ పాత్ర పేరు. ఆ పాత్రకు సంబంధించిన బొమ్మనే సెయింట్ ఆంథోని విగ్రహంగా పొరపాటు పడిన ఆ బామ్మ ఇన్నాళ్లూ పూజలు జరుపుతూ వచ్చింది. ఎల్రాండ్- సెయింట్ ఆంథోని విగ్రహాలు చూడానికి ఒకేలా ఉంటాయి కాబట్టి ఆ విగ్రహాల మధ్య తేడాలను గుర్తించలేకపోయిన ఆ బామ్మ ఈ విగ్రహానికి పూజలు చేస్తూ వచ్చింది.
తాను ఆ విగ్రహం సెంయింట్ అంథోనిది కాదని గుర్తించిన తరువాత తన బామ్మకు చెప్పానని, అయితే ఈ విషయాన్ని తన బామ్మ మొదట నమ్మలేదని, ఆ తర్వాత మరింత వివరించి చెప్పడంతో 'అయ్యో' అంటూ బాధపడిపోయిందని గాబ్రిలా చెప్పింది. గాబ్రిలా చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసక్తికర కామెంట్లను అందుకుంటోంది.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fgabrielabrandaomakeup%2Fposts%2F10211471255559690&width=500" width="500" height="626" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true"></iframe>