nokia: టెక్ దిగ్గజాలతో పోటీ పడుతూ దూసుకువస్తున్న నోకియా!
ఫీచర్ ఫోన్‌లకే పరిమితమై, స్మార్ట్‌ఫోన్ల టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనకబడిన నోకియా చివరికి మార్కెట్లో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎంతో మంది మొబైల్ యూజర్ల నుంచి నమ్మకమైన సంస్థగా పేరు తెచ్చుకున్న నోకియా చాలా కాలం తరువాత తిరిగి విపణిలోకి వచ్చి, మరింత వేగం పెంచేసింది. ఇటీవలే తన తొలి స్మార్ట్‌ఫోన్ ‘నోకియా 6’ను విడుదల చేసిన సదరు సంస్థ... స్మార్ట్ అప్లికేషన్లతో కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీలకు పోటీగా ‘వికి’ పేరుతో వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. అందుకు సంబంధించిన ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం యూరోపియన్ యూనియన్‌లో దరఖాస్తు కూడా చేసుకుంది నోకియా.
మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు ఇటువంటి అప్లికేషన్‌నే తీసుకొచ్చి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే శాంసంగ్ కూడా వాయిస్ అసిస్టెంట్ యాప్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ కంపెనీలన్నింటితో నోకియా పోటీపడుతూ ముందుకు వెళుతుండడం గమనార్హం.