suitcase: సూట్‌కేసులో ప్రియుడిని కుక్కి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి, దొరికిపోయిన ప్రియురాలు!
తాను ప్రేమించిన యువకుడి కోసం ఓ యువతి పోలీసులనే మోసం చేసే దుస్సాహసం చేసిన ఘటన బార్సిలోనాలోని ప్యుంటె అయేలా జైలులో చోటు చేసుకుంది. వెనుజులాకి చెందిన 25 ఏళ్ల ఆంటోనిటా రొబుల్స్ సౌడా అనే యువతి జైలులో శిక్ష అనుభవిస్తున్న తన ప్రియుడు జోస్ ఆంటోనియోను కలిసేందుకు వెళ్లింది. తనతో పాటు ఓ గులాబి రంగు సూట్‌కేస్‌తో పాటు తన పాపను తీసుకెళ్లింది. ఆ జైల్లో ఖైదీలను చూసేందుకు వచ్చిన వారు రాత్రంతా జైలులో ఉండే సౌకర్యం కల్పిస్తారు. దీనిని అదునుగా తీసుకున్న ఆ యువతి తన ప్రియుడితో రాత్రంతా జైలులో ఉండి తాను తెచ్చుకున్న సూట్ కేసులో తన ప్రియుడిని కుక్కి పడుకోబెట్టింది.
ఉదయాన్నే ఆ సూట్‌కేసును బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మరికాసేపట్లో జైలు నుంచి దాటేస్తామన్న సమయంలో జైలు ద్వారం వద్ద సూట్‌కేసును మోసుకెళ్లలేక ఇబ్బంది పడింది. బరువు ఎక్కువగా ఉండడంతో దాన్ని మోసుకెళ్లేందుకు నానా అవస్థలు పడింది. ఈ విషయాన్ని గమనించిన అక్కడి పోలీసులు అనుమానం వచ్చి సూట్‌కేసును తెరిచారు. అందులో ఆమె ఉంచిన తన ప్రియుడిని చూసి ఆశ్చర్యపోయారు. తమ కళ్లు కప్పి ఖైదీని తప్పించాలని చూసిన ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ కేసులో ఆమెను రిమాండుకి తరలించారు. దీంతో వారి పాపను పోలీసులు సోషల్ సర్వీస్ డిపార్ట్‌మెంటుకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.