Bipin Rawat: భోజనం సరిగా ఉండట్లేదని జవాను చేసిన ఆరోపణలపై స్పందించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
తమకు నాణ్యతలేని భోజనం పెడుతున్నారంటూ ఇటీవల ఓ బీఎస్ఎఫ్ జవాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. ప్రతి ఆర్మీ ఆఫీసులో ఫిర్యాదు బాక్స్ ఉంటుందని చెప్పిన ఆయన.. ఏమైనా ఫిర్యాదులు ఉంటే దాని ద్వారా చేయవచ్చని అన్నారు. లేదంటే ఫిర్యాదులను తనకు కూడా నేరుగా ఇవ్వవచ్చని సూచించారు. జవాన్లకు ఏవైనా సమస్యలు ఏర్పడితే వాటిని అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాని, సోషల్ మీడియాలో పోస్టులు చేయడం భావ్యం కాదని అన్నారు.
లౌకికవాద దేశమైన భారత్‌లో సరిహద్దుల వద్ద ఎన్నో సమస్యలు ఉంటాయని రావత్ అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందని, ఆ రాష్ట్రంలో విద్యాలయాలను యథావిధిగా నడపాలని అన్నారు. ఉగ్రవాదుల చొరబాట్ల వల్ల భారత్‌కు ప్రమాదం ఉంటుందని, ఆర్మీ 24 గంటలూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైనికులు మరింత శక్తిమంతంగా తయారు కావాలని పేర్కొన్నారు.