firing: తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఆ జవాను మానసిక స్థితి సరిగా లేదట!
రెండు రోజుల క్రితం బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఓ జవాన్ తన తోటి జవాన్లపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన బల్బీర్ సింగ్ జరిపిన ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు ఆ జవాను కాల్పులకు పాల్పడడంపై వివరణ ఇచ్చారు. కాల్పులు జరిపిన బల్బీర్ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నట్లు తెలిపారు. తన కొడుకు కాల్పులు జరపడంపై బల్బీర్ తల్లి మాట్లాడుతూ.. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అందరికీ తెలుసని చెప్పింది. జల్బీర్ స్నేహితులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ అతడు ప్రమాదకరమైన వ్యక్తి అని తెలిపారు.
గతంలో బల్బీర్ ఆరోగ్య పరిస్థితిపై అతడి కుటుంబసభ్యులు సీఐఎస్‌ఎఫ్ అధికారులకు వివరించినప్పటికీ అతడు విధులు నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. గతంలోనూ బల్బీర్ సింగ్ ఇటువంటి ఘటనకు పాల్పడ్డాడని సమాచారం. బొకారోలో ఆయన విధులు నిర్వర్తించే సమయంలో ఓ కారు డ్రైవర్‌ను చంపడానికి ప్రయత్నించాడట. మానసిక పరిస్థితి బాగోలేని బల్బీర్‌ను విధుల్లో ఉంచి అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి.