mulayam singh yadav: నా కుమారుడు అఖిలేష్‌పై పోటీ చేస్తా: ములాయం సింగ్ సంచలన ప్రకటన


ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌లోని అధికార‌ సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబపోరు రోజురోజుకీ ముదురుతూనే ఉంది. కుటుంబ‌ క‌ల‌హాల వ‌ల్ల పార్టీలో ఏర్ప‌డిన‌ సంక్షోభంతో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అఖిలేష్ కాంగ్రెస్‌తో క‌లిసి ఎన్నిక‌ల పోటీలోకి దిగ‌నున్న‌ట్లు సంకేతాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ములాయం, అఖిలేష్ వ‌ర్గాల్లో ఎవరికి చెందాలనే విషయం గురించి ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ఈ రోజు వెలువరించే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ములాయం తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ములాయం సింగ్ ఓ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు అఖిలేష్ మీదే తాను పోటీ చేస్తాన‌ని చెప్పారు.

త‌న కుమారుడు రాష్ట్రంలోని ముస్లింల‌ను రెచ్చగొడుతున్నాడ‌ని ములాయం వ్యాఖ్యానించారు. తాను స‌మాజ్‌వాదీ పార్టీని, త‌మ పార్టీ గుర్తును కాపాడుకోడానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నానని అయితే అఖిలేష్ తన మాటలను లెక్క‌చేయ‌క‌పోతే, తాను ప్రత్యక్షంగా అతడిపై పోటీకి దిగుతానని ఆయ‌న చెప్పారు. అఖిలేష్‌తో చ‌ర్చించ‌డానికి తాను ఆయ‌న‌ను ఇప్ప‌టికి మూడుసార్లు పిలిచానని, కానీ అఖిలేష్‌ ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి తాను చెప్పేది విన‌కుండానే వెళ్లిపోయాడ‌ని ఆయ‌న చెప్పారు.

త‌మ పార్టీ గుర్తు విషయంలో ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉన్నా దాన్ని ఆమోదిస్తామని తెలిపారు. త‌న కుమారుడు అఖిలేష్ బీజేపీతో పాటు ప‌లు ప్రతిపక్షాలతో చేతులు కలిపాడని ఆయ‌న ఆరోపించారు. అఖిలేష్‌కి తాను నచ్చజెప్పడానికి ప్రయత్నించాన‌ని అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ చేస్తోన్న‌ తప్పులను తెలుసుకోవడం లేదని ములాయం సింగ్ అన్నారు.

  • Loading...

More Telugu News