idea: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు పోటీగా ఐడియా
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు పోటీగా మరో టెలికాం రంగ సంస్థ ఐడియా పూర్తి స్థాయి డిజిటల్ సేవల్లోకి ప్రవేశిస్తోంది. పూర్తి డిజిటల్ సేవల సంస్థగా తమ సర్వీస్‌ను మార్చే దిశగా కొత్త యాప్‌లను ప్రారంభించబోతుంది. మూవీస్, మ్యూజిక్, టీవీ, గేమ్స్ ఇలా అంశాలను తమ కొత్త యాప్‌లో ఉంచనుంది. ఇందు కోసం ఇప్పటికే మ్యూజిక్ అండ్ మూవీ కంటెంట్ ను అందించేందుకు ఒప్పందాలు చేసుకొని మరోవైపు వాల్యూ ఏడెడ్ సేవల విస్తరణకు, ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, కమ్యూనికేషన్ అండ్ యుటిలిటీస్ పలు కేటగిరీల్లో తమ బ్రాండెడ్ డిజిటల్ సర్వీసుల కోసం ఒప్పందాలపై సంతకాలు చేసింది.
ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ... తాము అందిస్తున్న వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ డేటా సేవలు సహా ఇకపై పూర్తి డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీగా అవతరిస్తున్నట్లు తెలిపారు. భారతీయ కస్టమర్ల ఆన్‌లైన్ డిమాండ్ లను నెరవేర్చే క్రమంలో తమ వాగ్దానానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. కొన్ని నెలల క్రితమే మార్కెట్లోకి వచ్చి దూసుకుపోతున్న జియో ప్రభావంతోనే మిగతా కంపెనీలు కంటెంట్ ఆఫర్స్ పై దృష్టిపెడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.