gold rate: మరింత పడిపోయిన బంగారం ధర
బులియన్ మార్కెట్లో పసిడి ధర నిన్న రెండు వారాల కనిష్టానికి చేరుకుని 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.175 తగ్గి రూ. 29,550గా నమోదైన విషయం తెలిసిందే. ఈ ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టి మరో రూ.400 తగ్గి రూ.29,150కి చేరుకుంది. మార్కెట్లో బంగారంకు డిమాండ్ లేకపోవడంతో వ్యాపారులు పసిడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అందుకే ధర పడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు నాణేల తయారీదారుల నుంచి డిమాండు లేకపోవటంతో కిలో వెండి కూడా రూ.550 తగ్గి రూ.40,950గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.37 శాతం తగ్గి 1,183 డాలర్లుగా ఉండగా, ఔన్సు వెండి ధర 0.27 శాతం తగ్గి 16.70 డాలర్లుగా నమోదైంది.