kodandaram: భయపడేది లేదు.. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ప్రొ.కోదండరాం
రాష్ట్రం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినప్పటికీ యువతకు ఉద్యోగాలు కల్పించని తెలంగాణ ప్రభుత్వ తీరుపై పోరాడతామని ప్రొ.కోదండరాం తెలిపారు. కోదండరాం అధ్యక్షతన ఈ రోజు హైదరాబాద్లోని నాంపల్లిలో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఈ నెల చివర్లో నిర్వహించాలనుకుంటున్న నిరుద్యోగ నిరసన ర్యాలీపై చర్చించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సమస్యపై వారు చర్చించారు. అనంతరం మీడియాతో కోదండరాం మాట్లాడుతూ... తమ నాయకులను సమాచార సేకరణ పేరుతో ఇంటెలిజెన్స్ పోలీసులు వేధిస్తున్న ఘటనలపై కూడా ఈ భేటీలో తాము చర్చించామని, వేధింపులకు తాము భయపడేది లేదని ఉద్ఘాటించారు.
తెలంగాణలో ప్రభుత్వ రంగంలో మొత్తం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని కోదండరాం అన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసి వుండాల్సిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏటా 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా 50 నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం 6 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు. ఈ సమస్యలకు నిరసనగా ఈ నెల 22న నిరుద్యోగుల నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ నియామకాల తీరుపై యువతతో కలిసి నిరసనల్లో పాల్గొంటామని చెప్పారు. ఈ భేటీలో టీజేఏసీ రాష్ట్రస్థాయి సభ్యులతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు.