demonitisation: డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక భద్రతపై కఠిన చర్యలు: ఆర్బీఐ
నగదు రహిత లావాదేవీలు జరిగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోన్న నేపథ్యంలో వాటి భద్రతపై బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు చేసింది. బ్యాంకుల వెబ్‌సైట్‌ల పై సైబర్ దాడులు, డెబిట్ కార్డు మోసాలు, సర్వర్లలోకి అనధికార యాక్సెస్‌లు జరుగుతున్నట్టు కేంద్రీయ బ్యాంకు వద్ద సమాచారం ఉందని ఆర్‌బీఐ డిప్యూటి గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా తెలిపారు.
వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి సంఘటన జరిగినా బ్యాంకులు తమకు రెండు నుంచి ఆరు గంటల్లోగా సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే, సకాలానికి రిపోర్ట్ చేయకపోయినా, రుణ మోసాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లను హెచ్చరించారు. బ్యాంకులు ఆయా వివరాలను తమకి వివరించడంలో విఫలమవుతున్నాయని అన్నారు.