laxmi parvathi: చరిత్రను వక్రీకరిస్తే ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమే!: ‘ఎన్టీఆర్’ చిత్రంపై లక్ష్మీ పార్వతి
దివంగత ముఖ్యమంత్రి, సినీనటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తామని నందమూరి బాలకృష్ణ ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపై స్పందించిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమాలో చరిత్రను ఏ మాత్రం వక్రీకరించినా తాను ఎంత దూరమైన వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. తాను ఇన్నేళ్లుగా ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నానని, తాను ఒక్కరూపాయి కూడా ఆశించలేదని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ మరణం మీద విచారణ జరిపించాలని ఆనాడు తాను అసెంబ్లీ నేతలని డిమాండ్ చేశానని అన్నారు.
తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, మొదట తాను లెక్చరర్‌గా పనిచేశానని, తనను మెచ్చుకొని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని లక్ష్మిపార్వతి చెప్పారు. వారు సినిమా తీయాలనుకుంటే.. 9 నెలల్లో ఆయన సీఎం అయిన తీరుని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన తీరుని మాత్రమే చూపించి శుభం వేయాలని ఆమె సూచించారు. సినిమా చివరి వరకు బాలయ్య తన బావ చంద్రబాబుని గొప్పవాడిలా చూపిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. తాను తప్పు చేశానని పలువురు వ్యాఖ్యలు చేశారని, కానీ తాను తప్పు చేసినట్లు కనీసం ఒక్కరయినా నిరూపించగలిగారా? అని ఆమె నిలదీశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పుస్తకాల్లో ప్రచురించాలని ఆమె డిమాండ్ చేశారు.