Tamilnadu: మూజువాణి ఓటు, డివిజన్, రహస్య ఓటింగ్ ఏమిటి?.. స్టాలిన్ రహస్య ఓటింగ్ కు ఎందుకు పట్టుబట్టాడు?
తమిళనాడు శాసనసభలో హైడ్రామా మధ్య పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని గట్టెక్కింది. కానీ తొలుత పళనిస్వామి ప్రభుత్వం మూజువాణి ఓటుతో గెలుపొందిందంటూ వార్తలు వచ్చాయి. తర్వాత డివిజన్ ఓటుతో గట్టెక్కిందని వెల్లడైంది. అసలు మూజువాణి ఓటింగ్ వద్దని.. రహస్య ఓటింగ్ చేపట్టాలంటూ డీఎంకే పట్టుబట్టి, సభలో గందరగోళం సృష్టించింది. ఈ నేపథ్యంలో చట్టసభల్లో మూజువాణి ఓటు, డివిజన్ ఓటు అంటే ఏమిటో తెలుసుకుందాం..
మూజువాణి ఓటు
ఏదైనా బిల్లు, తీర్మానంపై సభలోని సభ్యులు తమ అభిప్రాయాన్ని అవును, లేదా కాదు అంటూ మూకుమ్మడిగా అరిచి చెప్పడమే మూజువాణి ఓటు. దీనిని ఆంగ్లంలో ‘VOICE VOTE’గా చెబుతారు. రాజ్యాంగ రూపకల్పనలో పాశ్చాత్య దేశాల పద్ధతులను అన్వయించుకోవడంలో భాగంగా ఇది అమల్లోకి వచ్చింది. సభలో స్పీకర్/చైర్మన్ ఏదైనా అంశంపై సభ్యుల అభిప్రాయాన్ని మూజువాణి ఓటు విధానంలో కోరుతారు. దానికి ఆమోదించేవారు ‘Aye (Yes)’ అనాలని.. వ్యతిరేకించేవారు ‘NAY (NO)’ అనాలని కోరుతారు. ఆమోదించే సభ్యులంతా తొలుత ‘Aye (Yes)’ అని, వ్యతిరేకించేవారు ‘NAY (NO)’ అని అరుస్తారు. దీనిలో ఏది ఎక్కువగా అన్నట్లుగా భావిస్తే.. దానివైపు మొగ్గినట్లుగా స్పీకర్/చైర్మన్ నిర్ణయించి ప్రకటిస్తారు. ఎంతమంది ‘Aye (Yes)’ అన్నారు, ఎంత మంది ‘NAY (NO)’ అన్నారు అనేదానికి కచ్చితమైన లెక్క ఉండదు. స్పీకర్ నిర్ణయమే అంతిమం. అందువల్లే తమిళనాడు శాసనసభ స్పీకర్ మూజువాణి ఓటు నిర్వహించేందుకు ప్రయత్నించారు.
డివిజన్ ఓటు
చట్టసభలో సభ్యులు ఒక్కోసారి డివిజన్ ఓటు కోసం పట్టుబట్టే అవకాశం ఉంటుంది. దీనినే హెడ్ కౌంట్ (శాల్తీల లెక్క) అని కూడా అంటారు. శనివారం తమిళనాడు శాసనసభలో జరిగింది ఇదే. ఏదైనా అంశంపై స్పీకర్ సభ్యుల అభిప్రాయాన్ని డివిజన్ ఓటింగ్ విధానంలో కోరుతారు. ఇందులో భాగంగా అనుకూలంగా ఉన్నవారిని, వ్యతిరేకించేవారిని, తటస్థంగా ఉండేవారిని వేర్వేరు సార్లు చేతులెత్తడం లేదా లేచినిలబడడం ద్వారా అభిప్రాయం కోరుతారు. అంటే అనుకూలంగా ఉన్నవారిని ఒకసారి లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కిస్తారు. తర్వాత వ్యతిరేకించేవారిని లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కిస్తారు. చివరగా తటస్థంగా ఉండేవారి సంఖ్యను లెక్కిస్తారు. అంతిమంగా ఆ అంశానికి ఎంతమంది అనుకూలం, ఎంత మంది వ్యతిరేకమనేది లెక్కించి.. నిర్ణయం తీసుకుంటారు. ఈ విధానంలో కచ్చితమైన లెక్క ఉంటుంది. ఏయే సభ్యులు ఏ అభిప్రాయాన్ని వెల్లడించారన్నది తెలిసిపోతుంది.
రహస్య ఓటింగ్ కు ఎందుకు పట్టు?
పై రెండు పద్ధతులే కాకుండా చట్టసభల్లో ఏదైనా అంశంపై రహస్య ఓటింగ్ కూడా నిర్వహిస్తారు. ఎలక్ట్రానిక్ విధానంలోగానీ, బ్యాలెట్ ఓటు విధానంలోగానీ దీనిని నిర్వహిస్తారు. సమావేశ మందిరంలో ఓ చోట అవును, కాదు అని రాసి ఉన్న రెండు బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేస్తారు. సభ్యులు తమకు ఇచ్చిన బ్యాలెట్ పేపరును తమ అభిప్రాయం ప్రకారం ఎంచుకున్న బ్యాలెట్ బాక్సులో వేస్తారు. ఎందులో వేసేదీ బయటకు కనిపించకుండా ఏర్పాటు చేస్తారు. ఈ విధానంలో సభ్యుల అభిప్రాయం అత్యంత కచ్చితంగా వెలువడడంతోపాటు ఎవరు అనుకూలంగా, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారనేది బయటికి వెల్లడి కాదు. అందువల్లే శుక్రవారం తమిళనాడు శాసనసభలో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే సభ్యులు రహస్య ఓటింగ్ కోసం పట్టుబట్టారు. సాధారణంగా ఏదైనా అంశంపై పార్టీ తీసుకున్న నిర్ణయానికి, విప్ కు అనుగుణంగా ఆయా పార్టీల సభ్యులు సభలోని అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అదే రహస్య ఓటింగ్ జరిగితే తమకు నచ్చినట్లుగా, ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొందరు అన్నాడీఎంకే సభ్యులైనా పళనిస్వామి ప్రభుత్వ విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న ఉద్దేశంతో స్టాలిన్ రహస్య ఓటింగ్ కు పట్టుబట్టారు.