Kcr: ఆడపిల్ల పుడితే రూ.13 వేలు.. అంగన్ వాడీల్లో పిల్లలకు తిన్నంత ఆహారం: కేసీఆర్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని.. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు అందజేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పిల్లలకు ఇమ్యూనైజేషన్ (వ్యాక్సిన్లు) వేయించడం కోసం కూడా ఆర్థిక సాయం చేస్తామని, మొత్తంగా రూ.15 వేల వరకు అందించాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. సోమవారం అంగన్ వాడీలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ప్రైవేటు వైద్యులు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని.. అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారని, గర్భ సంచీలు తొలగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది పరమ దుర్మార్గమని, నీచమని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేందుకు అంగన్ వాడీలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మూడు విడతలుగా అందజేస్తాం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగే పేద మహిళలందరికీ రూ.12 వేలు అందజేస్తామని.. రూ.4 వేల చొప్పున మూడు విడతల్లో అందించాలనే ఆలోచన ఉందని కేసీఆర్ వెల్లడించారు. గర్భిణిగా వైద్యం పొందుతున్నప్పుడు ఒక విడత, ఆస్పత్రిలో ప్రసవం జరిగినప్పుడు మరో విడత, చిన్నారికి వేక్సిన్లు వేయించడానికి వచ్చినప్పుడు మూడో విడత డబ్బు చెల్లిస్తామన్నారు. ఆడపిల్ల పుడితే చివరి విడతలో మరో రూ.1000 అదనంగా అందిస్తామని చెప్పారు. వీటితోపాటు పుట్టిన చిన్నారుల మూడు నెలల అవసరాలకు ఉపయోగపడేలా రూ.2 వేల విలువైన సబ్బులు, క్రీమ్ లు, ఆయిల్, పౌడర్, చిన్న బెడ్, టవల్ వంటి వాటితో ఒక కిట్ ను కూడా అందజేస్తామని తెలిపారు. చిన్నారుల మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. అంగన్ వాడీల్లో పిల్లలకు సరిపడినంత ఆహారం పెడతామని, గ్రాముల లెక్క ఉండదని తెలిపారు.