Mahesh: మహేశ్ పాత్రపై కొరటాల శివ వివరణ!
ఇటీవలే 'స్పైడర్' చిత్రాన్ని పూర్తి చేసిన మహేశ్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. 'భరత్ అను నేను' పేరిట రూపొందుతున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని, ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. పైగా ఈ చిత్రం సమకాలీన రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తుందని వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దర్శకుడు శివ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఏ రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీయడం లేదని ఆయన చెప్పాడు. అలాగే, ఇందులో మహేశ్ పోషిస్తున్న పాత్ర ఏ రాజకీయ నాయకుడినీ పోలి ఉండదని తెలిపాడు. ఇక ఇందులో ఎటువంటి వ్యంగ్య సంభాషణలు ఉండవని దర్శకుడు తేల్చిచెప్పాడు. కాగా, ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో జరుగుతోంది.