prabhas: 'బాహుబలి 2'లో మూడు బాణాలు ఒకేసారి ఎక్కుపెట్టే ఆలోచన రాజమౌళికి అలా వచ్చిందిట!
'బాహుబలి 2' సినిమాలో 'కుంతల రాజ్యం'పైకి శత్రువులు ఒక్కసారిగా విరుచుకు పడతారు. ఆ సమయంలో ఒకేసారి మూడు బాణాలను ఎక్కుపెట్టి వదిలే విధానాన్ని దేవసేనకి బాహుబలి చెబుతాడు. అలా చేయడం వలన ఒకే వేటుకు ముగ్గురు శత్రువులు నేల కూలుతుంటారు. ఈ దృశ్యం చూసిన వాళ్లంతా రాజమౌళికి ఆ ఆలోచన ఎలా వచ్చిందని అనుకోవడం సహజం.
సినిమా నిర్మాణంలో ఉండగా ఒకసారి రాజమౌళి తమిళనాడు 'తాళ్లి'లోని 'అరమ్' ఆర్కియాలజీ రీసెర్చ్ సెంటర్ కి వెళ్లారట. అక్కడ యుద్ధ సంబంధమైన శిల్పాలను చూశారు. మూడు బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టిన యుద్ధ వీరుల శిల్పాలను చూసి ఆయన ఆశ్చర్యపోయారట. అది 13వ శతాబ్దం నాటికి చెందిన యుద్ధ విన్యాసమని తెలుసుకున్నారు. అదే పద్ధతిని ఆయన 'బాహుబలి 2'లో యుద్ధ సన్నివేశాల్లో ఉపయోగించడం జరిగిందట.