north korea: అమెరికా నేతలకు ఆ ధైర్యం కూడా లేకుండా చేస్తా!: కిమ్ జాంగ్
- అమెరికాతో సమానంగా సైనిక సామర్థ్యమే లక్ష్యం
- భయపడే ప్రసక్తే లేదు
- అమెరికా నేతలకు దడ పుట్టాలి
అమెరికాతో సమానంగా తమ సైనిక సామర్థ్యం ఉండాలనేదే తమ లక్ష్యమని ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ తెలిపారు. సైనిక సామర్థ్యం సమానంగా ఉంటేనే... అమెరికాను నిలువరించగలుగుతామని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి జపాన్ భూభాగం మీదుగా అణు క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం అనంతరం కిమ్ జాంగ్ స్థానిక మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా అంతు చూస్తామని అమెరికా బెదిరిస్తోందని... ఈ నేపథ్యంలో, అమెరికాను దీటుగా ఎదుర్కొనేందుకే, తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని చెప్పారు. తమపై సైనిక చర్య తీసుకుంటామని అనే ధైర్యం కూడా అమెరికా నేతలకు లేకుండా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.