ayodhya: జీవితాంతం అయోధ్య రామాలయం కోసం పరితపించిన మహంత్ భాస్కర్ దాస్ అస్తమయం!
- గుండెపోటుతో మృతి
- రామాలయం కోసం దశాబ్దాలుగా కృషి చేస్తున్న భాస్కర్ దాస్
- ఆయన వయసు 88 సంవత్సరాలు
- 1949 నుంచి బాబ్రీ కేసులో భాగస్వామ్యం
- సంతాపం వెలిబుచ్చిన పలువురు నేతలు
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం జీవితాంతమూ పరితపించిన నిర్మోహీ అఖడా చీఫ్ మహంత్ భాస్కర్ దాస్ ఈ ఉదయం అస్తమించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం తమదేనని దశాబ్దాలుగా వాదిస్తున్న మూడు సంస్థల్లో నిర్మోహీ అఖడా ఒకటి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భాస్కర్ దాస్ కు గుండెపోటు వచ్చిందని, ఆ వెంటనే హర్షన్ హృదయ సంస్థాన్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేశారని, అయినా ఫలితం కనిపించలేదని నిర్మోహి అఖడా ప్రకటించింది.
కాగా, 2003, 2007 సంవత్సరాల్లో ఆయనకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. అప్పట్లో తప్పించుకున్న ఆయన ఈ దఫా మాత్రం మృత్యు కౌగిలి నుంచి బయటపడలేక పోయారు. 1929లో గోరఖ్ పూర్ లో పుట్టిన ఆయన, 1946లో అయోధ్యకు వచ్చారు. 1949 నుంచి రామ జన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో భాగస్వామ్యమై, రామాలయం నిర్మాణమే తన జీవితాశయం అన్నట్టు శ్రమించారు. ఆయన మృతిపై వీహెచ్ పీ, బీజేపీ తదితర పార్టీల నేతలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు.