chandrababu: ఈసారి జగన్ ఇలాకాలో ఎలక్షన్... ఇంకో ఝలక్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్లాన్!
- కోర్టు కేసులతో వాయిదా పడుతూ వచ్చిన రాజంపేట మునిసిపల్ ఎన్నిక
- సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు జరిపించాలని భావిస్తున్న టీడీపీ అధినేత
- చంద్రబాబు ఆదేశాలతో కదిలిన క్యాడర్
- అభివృద్ధి మంత్రమే గెలిపిస్తుందంటూ జోరుగా 'ఇంటింటికీ తెలుగుదేశం'
- పోటీ ప్రచారం మొదలుపెట్టిన వైఎస్ఆర్ సీపీ
- 'నవరత్నాలు' గుర్తు చేస్తూ 'వైఎస్ఆర్ కుటుంబం'
- అప్పుడే మొదలైన ఎన్నికల సందడి
ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెను షాకిచ్చిన తెలుగుదేశం, ఈ దఫా జగన్ ఇలాకాలోనే ఆయనకు ఝలక్ ఇవ్వాలని భావిస్తోంది. కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన కడప జిల్లా రాజంపేట మునిసిపాలిటీకి ఎన్నికలు జరిపించి, దాన్ని గెలుచుకుని జగన్ కు ప్రజాభిమానం తగ్గిందని నిరూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తొలుత కోర్టులో ఉన్న కేసులను తొలగించి, ఆపై ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న చంద్రబాబు, ప్రస్తుతం చేపట్టిన 'ఇంటింటా తెలుగుదేశం' పేరిట రాజంపేటపై ప్రత్యేక దృష్టిని సారించారు. అక్కడి స్థానిక నాయకత్వాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే రాజంపేట మునిసిపల్ అధికారులకు రహదారులు, డ్రైనేజీ కాలువలు, ఎల్ఈడీ వీధి దీపాలు వంటి పనులతో పాటు, పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పనులను తెలుగుదేశం శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నంద్యాలలో, కాకినాడలో ఫలించిన అభివృద్ధి మంత్రమే ఇక్కడా పని చేస్తుందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలుగుదేశం ఎత్తుగడల గురించి తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ క్యాడర్ ను అప్రమత్తం చేసింది. స్థానిక పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి స్వయంగా 'వైఎస్ఆర్ కుటుంబం' పేరిట ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్లీనరీలో జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలను వివరిస్తూ, కరపత్రాలు పంచుతున్నారు. దీంతో ఇప్పుడే రాజంపేటలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదుగానీ, నిత్యమూ వందలాది మంది టీడీపీ, వైకాపా కార్యకర్తలు ప్లకార్డులు, జెండాలు పట్టి ప్రచారం చేసుకుంటూ సాగుతున్నారు. వైకాపాకు పెట్టని కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తమ పట్టును కొనసాగించాలని తెలుగుదేశం, ఎలాగైనా నిలుపుకొని పూర్వ వైభవం సాధించాలని వైకాపా గట్టిగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.