gurmith baba: ఇద్దరిని హత్య చేసిన కేసులో నిజం చెప్పొద్దని గుర్మీత్ అనుచరులు బెదిరించారు: డేరా బాబా డ్రైవర్
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుర్మీత్ బాబాను విచారించిన సీబీఐ కోర్టు
- గతంలో తప్పుడు వాంగ్మూలం ఇచ్చానన్న డ్రైవర్
- మరోసారి వాంగ్మూలం ఇస్తానని పిటిషన్
- విచారణ ఈ నెల 22కి వాయిదా
అత్యాచారం కేసులో జైలులో శిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ బాబా రెండు హత్య కేసుల్లోనూ ప్రధాన కుట్రదారుడిగా విచారణ ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే. ఈ రోజు పంచకులలోని సీబీఐ కోర్టులో నిందితుడు గుర్మీత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ఎదుర్కున్నాడు. ఆయనను కోర్టు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో గతంలో కోర్టు గుర్మీత్ మాజీ డ్రైవర్ ఖట్టా సింగ్ వాంగ్మూలాన్ని తీసుకుంది.
అయితే, ఈ సమయంలో డేరా బాబా అనుచరులు ఆయనను బెదిరించడంతో తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ డ్రైవరే తెలుపుతూ తన వాంగ్మూలాన్ని మరోసారి తీసుకోవాలని పిటిషన్ వేయగా దీనిపై సెప్టెంబరు 22న మరోసారి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. 2002లో జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి, డేరా మాజీ మేనేజన్ రంజీత్ సింగ్ హత్యకు గురయ్యారు. ఈ కేసులోనే డేరా బాబా ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు.
గుర్మీత్ మాజీ డ్రైవర్ ఖట్టా సింగ్ తన వాంగ్మూలాన్ని 2017లో ఇచ్చాడు. ఇప్పుడు డేరా బాబా ఆగడాలకు అడ్డుకట్ట పడడంతో మళ్లీ వాంగ్మూలం ఇస్తానని, ఈ సారి నిజం చెబుతానని సదరు డ్రైవర్ చెబుతున్నాడు. కాగా, మరోపక్క బీహార్, నేపాల్ బార్డర్ లో హనీప్రీత్ ఇన్సాన్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.