kakinada: నా సమాధానం ఏమిటో ముందుముందు చూపిస్తా!: కాకినాడ టీడీపీ కార్పొరేటర్ శేషుకుమారి
- కాకినాడ టీడీపీలో మేయర్ పదవి చిచ్చు
- పదవి రాకపోవడంతో శేషుకుమారి కంటతడి
- ఎంపీ తోట ముందే వాగ్వాదం
- ఎనిమిదేళ్లు సేవ చేసినా అవమానించారంటూ ఆగ్రహం
కాకినాడ మేయర్ పదవి కోసం ఐదుగురు ఆశావహులు చివరి వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే అదృష్టం మాత్రం చివరకు సుంకరి పావని తలుపు తట్టింది. దీంతో, మేయర్ పదవిని దక్కించుకోలేకపోయిన ఇతరులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో తనకు పదవి దక్కకపోవడంతో కార్పొరేటర్ శేషుకుమారి కంటతడి పెట్టారు. గత ఎనిమిదేళ్లుగా పార్టీ అభ్యున్నతి కోసం తాను ఎంతగానో శ్రమించానని... తన సేవలను హైకమాండ్ గుర్తించలేదని ఆమె వాపోయారు.
ఎంపీ తోట నరసింహం తనకు వ్యతిరేకంగా పని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా కాపునేనని... దీనికి సమాధానం ఏమిటో ముందుముందు చూపిస్తానని హెచ్చరించారు. పార్టీలోకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను తీసుకొచ్చారని, ఆ తర్వాత అన్ని విధాలా అవమానించారని మండిపడ్డారు. జిల్లా నాయకత్వం తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా... అధినేత చంద్రబాబు తనకు న్యాయం చేస్తారని భావించానని.. కానీ చివరకు తనకు అన్యాయం జరిగిందని చెప్పారు.