pak: ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తమ దేశానికి నీళ్లు రావన్న పాక్.. నిర్మించి తీరుతామన్న భారత్
- సింధూ నదీ జలాలపై వరల్డ్ బ్యాంక్ ను ఆశ్రయించిన పాకిస్థాన్
- ఇరు దేశాల వాదనలు విన్న వరల్డ్ బ్యాంక్
- కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమన్న పాక్
- 1960 ఒప్పందాలను ఉల్లంఘించలేదని తేల్చి చెప్పిన భారత్
సింధూ నదీ జలాలపై భారత్, పాకిస్థాన్ ల మధ్య వివాదం చెలరేగుతోన్న నేపథ్యంలో దీనిపై జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ వరల్డ్ బ్యాంక్‌ను ఆశ్రయించింది. దీంతో ఈ విషయంపై భారత్, పాక్ ముఖ్య అధికారులతో వరల్డ్ బ్యాంక్ నిన్న, మొన్న చర్చించింది. తాము చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయాలు లేవని తెలిపిన భారత్... జమ్ముకశ్మీర్‌లో కొత్తగా నిర్మిస్తున్న రెండు హైడ్రో ప్రాజెక్టులపై వెనుకంజ వేయబోమని తేల్చి చెప్పింది.
దీనిపై స్పందించిన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు.. 1960లో జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని గుర్తు చేశారు. భారత్ నిర్మించే ఆ ప్రాజెక్టులు ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. చర్చలతో పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. దీనిపై పాకిస్థాన్ ప్రతినిధులు స్పందిస్తూ భారత్ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు చేశారు. ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తమ దేశానికి నీళ్లు రావని అన్నారు. భారత ప్రతినిధులు స్పందిస్తూ... భారత్ 1960 ఒప్పందాలను ఉల్లఘించలేదని తేల్చి చెప్పారు. భారత్‌లో ప్రవహించే నదుల్లోనే, కేవలం విద్యుత్ అవసరాలకు మాత్రమే ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని అన్నారు. ఈ ప్రాజెక్టులతో జమ్ముకశ్మీర్ ప్రజలకు నీరు, విద్యుత్ అందుతాయని తెలిపింది.